లలిత శేఖర సంభాషణలు - 3
“ఏవండీ… వర్షం వచ్చేలా ఉంది!” అంటూ బాల్కనీ నుండి కేక వేసింది కూతురికి మొక్క నాటడం నేర్పిస్తున్న లలిత.
“అయ్యో… ఇందాకే మేడ మీద బట్టలు ఆరేశానే…” అంటూ కంగారు పడుతూ, గబగబా తను రాస్తున్న వ్యాసాన్ని పక్కన పెట్టి పరుగులు తీయడం మొదలుపెట్టాడు శేఖరం.
“జాగ్రత్త చూసుకోండి.. అంతా తడిగా ఉంది…”
(ఐదు నిమిషాల తర్వాత చేతిలో బట్టలతో వచ్చిన శేఖరం బాల్కనీ దగ్గర నిలబడి)
అది కాదు రాణి… మొన్న నీకు జరిగిన కంపెనీ సన్మానంలో.. నువ్వు ఆ కంపెనీకి సీఈఓ (CEO) గా అంత బాగా రాణించడానికి కారణం పదే పదే… “భర్త మద్దతు” అని ఆ ఛైర్మన్ అనడం నాకు నచ్చలేదు… ఇందులో నేను చేసింది ఏముంది?
“ఎందుకు నచ్చలేదండి.. మీ సపోర్ట్ లేకుండా.. మీరు కుటుంబ వ్యవహారాల్లో సమాన బాధ్యత తీసుకోకపోతే నేను ఇలా సాధారణ డిగ్రీ నుండి CEO వరకు వెళ్లడం కష్టం అవుతుండే కదా… కాదంటారా?” అని ప్రశ్నించింది లలిత.
అలా కాదు రాణి… ఇది పితృస్వామ్య భావనలతో నిండిన మనుషుల స్వభావం కదా… ఇప్పటివరకు ప్రతీ గొప్ప మొగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని స్త్రీ పాత్రని మొగవాడి నీడకు అంకితం చేశారు… ఇప్పుడేమో ఆడవాళ్ళ ముందు నుండి పక్కకి తప్పుకుంటే చాలు, వాళ్ళు చాలా రాణించగలరు అని తెలుసుకున్న నా లాంటి మొగవాడు ఎదురైనప్పుడు… అది మొగవాళ్ళ విజ్ఞత మరియు బాధ్యత అనేది పక్కన పెట్టి.. ఆడవాళ్ళ స్వ విజయంలో కూడా మొగవాళ్ళని గొప్పగా చూపించడానికి/మహిమాన్వితం చేయడానికి ప్రయత్నిస్తారు..
“అయ్యో గుమ్మం దగ్గర ఇంకొన్ని ఆరేశారు మర్చిపోయారండీ…”
– అరవింద్